Monday 27 April 2020

కారుణ్య నియామకాలు - COMPASSIONATE APPOINTMENTS DETAILS


కారుణ్య నియామకాలు - COMPASSIONATE APPOINTMENTS DETAILS 







    ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఆసరా కోల్పోతారు. ఇబ్బందుల్లో కూరుకుపోతారు. ఆరోగ్య కారణాల రీత్యా ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడినా అదే పరిస్థితి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోడానికే కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారు. అయితే ఈ నియామకాలపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఎప్పుడిస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికిస్తారు, ఎక్కడిస్తారు, ఎప్పటిలోపు ఇవ్వాలి, ఏ పోస్టులిస్తారు ఇలా అనేక అనుమానాలున్నాయి.

కారుణ్య నియామకాలు :

రెండు రకాలు :


ఒకటి : మరణించిన ఉద్యోగి కుటుంబీకులకు ఇచ్చేది.

రెండు : వైద్య కారణాల వల్ల ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగి ఆధారితులకు ఇచ్చేది.


కారుణ్య నియామకాల లక్ష్యం ఏమిటి ?
మరణించిన లేక అనారోగ్య సమస్య వల్ల ఉద్యోగం చేయలేని అసక్తత ఏర్పడిన ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం.

కొన్ని ఉత్తర్వులు :
▪ మరణించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడినవారికి జీవో 687, జీఏడీ, 03.10.1977 ద్వారా కారుణ్య నియామకం ఇస్తారు.

▪ కాలక్రమంలో ఈ జీవోకు సంబంధించి పలు సవరణలు, వివరణలు ఇచ్చారు. వీటన్నింటినీ చేర్చి 60681/సర్వీస్‌-ఏ/2003-1, జీఏడీ, 12.08.2003 ద్వారా సమగ్ర ఉత్తర్వులు ఇచ్చారు.

▪ వైద్య కారణాల వల్ల రిటైర్‌ అయిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామక అవకాశాన్ని జీవో ఎంఎస్‌ నెం.661, జీఏడీ, తేదీ 23.10.2008 ద్వారా పునరుద్ధరించారు.

▪ సర్వీసులో ఉండి మరణించిన ఎయిడెడ్‌ టీచర్ల వారసులకు కారుణ్య నియామకాలను జీవో ఎంఎస్‌ నెంబర్‌ 113, విద్యాశాఖ, తేదీ : 6.10.2009 ద్వారా అనుమతించారు.

కారుణ్య నియామకాలకు అర్హులెవరు ?
మరణించిన ఉద్యోగి వారసులు, వైద్య కారణాల వల్ల రిటైర్‌మెంట్‌ తీసుకున్న ఉద్యోగి వారసులు, ఏడేళ్లపాటు కనిపించకుండాపోయిన ఉద్యోగి వారసులు ఈ నియామకాలకు అర్హులు. వైద్య కారణాల వల్ల కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండగా రిటైర్‌మెంటు తీసుకుంటే ఆ ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తారు. కనిపించకుండాపోయిన ఉద్యోగి విషయంలో పోలీసు రిపోర్టు ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

ఎవరికిస్తారు ?
ఎలాంటి కారణ్య నియామకమైనా ఎవరికిస్తారన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి విధివిధానాలు ఉన్నాయి.

1. ఉద్యోగి భార్య/భర్త,

 2. కుమారుడు/కుమార్తె,

3. ఉద్యోగి మరణించిన నాటికి కనీసం ఐదేళ్ల మునుపు చట్టబద్ధంగా దత్తత తీసుకున్న కుమారుడు/కుమార్తె,

4. ఉద్యోగి భార్య/భర్త నియామకానికి ఇష్టపడని సందర్భంలో ఆ కుటుంబంపై ఆధారితురాలైన వివాహిత కుమార్తె,

5. మరణించిన ఉద్యోగికి ఒక వివాహిత కుమార్తె, మైనర్‌ కుమార్తె ఉంటే వారి తల్లి సూచించినవారికి ఉద్యోగం ఇస్తారు,

6. ఉద్యోగి అవివాహితుడై మరణించినపుడు అతని తమ్ముడు, చెల్లెలు కారుణ్య నియామకానికి అర్హులు.

ఏ పోస్టులో నియమిస్తారు ?
జూనియర్‌ అసిస్టెంటు పోస్టులోగానీ, ఆ పోస్టు స్కేలుకు మించని పోస్టులోగానీ, అంతకన్నా తక్కువస్థాయి పోస్టులోగానీ నియమిస్తారు.
నియామక విధానం ఎలా ?
ఉద్యోగి మరణించిన ఏడాదిలోపు అతని కుటుంబ సభ్యులుయ నియామకం కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. మైనర్‌ పిల్లల విషయంలో ఉద్యోగి మరణించిన రెండు సంవత్సరాలలోపు 18 సంవత్సరాలు వయసు నిండినపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది. వైద్య కారణాల వల్ల రిటైర్మెంట్‌ కోరుకునేవారి దరఖాస్తు జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీకి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామకాధికారి అనుమతి ఇస్తారు.

అర్హతలు :
ఆయా పోస్టులకు సంబంధించిన నిర్ణీత అర్హతలు కలిగివుండాలి. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌గా సబార్డినేట్‌ ఆఫీసులో నియామక అర్హతైన ఇంటర్మీడియెట్‌ పాసయ్యేందుకు 3 సంవత్సరాల గడువు, శాఖాధిపతి కార్యాలయం లేక సచివాలయం అయితే నియామక అర్హతైన డిగ్రీ పాసయ్యేందుకు 5 సంవత్సరాల గడువు ఇస్తారు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కులాల వారికి ఐదేళ్ల మినహాయింపు ఉంది. ఉద్యోగి భార్య/భర్తకు నియామకం ఇవ్వాల్సి వస్తే వారికి వయోపరిమితి 45 ఏళ్లు. చివరి శ్రేణి పోస్టుకు వయసు, అర్హతలు తగిన విధంగా లేనపుడు ముందు నియామకం ఇచ్చి ఆ తరువాత మినహాయింపును సంబంధిత శాఖ నుంచి పొందవచ్చును.

నియామక పరిధి :
మరణించిన ప్రభుత్వ ఉద్యోగి పనిచేసిన యూనిట్‌లో నియామకం ఇస్తారు. ఆ యూనిట్‌లో ఖాళీలు లేనపుడు ఆ కేసులను నోడల్‌ అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు పంపిస్తే ఆయన ఇతర డిపార్టుమెంట్లకు కేటాయిస్తారు. ఏ డిపార్టుమెంట్‌లోనూ ఖాళీలు లేని సందర్భంలో కలెక్టరు ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 5 వరకు సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించొచ్చు. అంతకు మించి పోస్టులు అవసరమైనపుడు సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపాలి.

ఈ కారుణ్య నియామకాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో సిక్స్‌ పాయింట్‌ ఫార్మలాకు లోబడి ఇవ్వబడతాయి. రిజర్వేషన్‌ నిబంధన (రూల్‌ 22)ను పాటించాల్సివుం

టుంది. మరణించిన ఉద్యోగి భార్య కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంటే ఆమె సొంత జిల్లాలోగానీ, భర్త ఉద్యోగం చేసిన చోటగానీ, ఏ ఇతర జిల్లాలోగానీ నియామకం కోరవచ్చు.               

◼️ ఇటీవలి ఉత్తర్వులు :

◾ భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి, అందులో ఒకరు రిటైర్‌ అయి పెన్షన్‌ తీసుకుంటుండగా, మరొకరు మరణిస్తే వారిపై ఆధారితులకు కారుణ్య నియామకం వర్తించదు. ఆ ఇంట్లో పెన్షన్‌ పొందుతున్న వ్యక్తి ఉన్నందున దాన్ని ఆదాయం ఉన్న కుటుంబంగానే పరిగణించి కారుణ్య నియామకం ఇవ్వరు. దీనికి సంబంధించి సర్క్యులర్‌ మెమో నెం.3548/సర్వస్‌-జి/ఏ2/2010-8, జీఏడీ, తేదీ : 24.03.2012 జారీ చేసింది.

◾ భర్త /భార్య చనిపోతే భార్యకు/భర్తకు 45 వయసు దాటితే కారుణ్య నియామకానికి అనర్హులు...అయినా ప్రభుత్వం నిబంధనలు సడలించి ఉద్యోగం ఇచ్చిన సందర్భం...
(GO MS No. 45 Dated .28.02.2020)

ఎక్స్‌గ్రేషియా :
కారుణ్య నియామకం ఇవ్వడానికి సాధ్యపడని సందర్భంలో నాల్గో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40వేలు, నాన్‌ గెజిటెట్‌ వారికి రూ.60 వేలు, గెజిటెడ్‌ ఉద్యోగుల కుటుంబాలకు రూ.80 వేలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలి. 

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top