Saturday, 23 November 2019

పంచతంత్రం - మిత్రలాభం (బోయవాడు - పావురాలు)పంచతంత్రం - మిత్రలాభం  (బోయవాడు - పావురాలు)

ఒక రోజు విష్ణుశర్మ రాకుమారులతో "మీకు ఈ రోజు మంచి విఙ్ఞానము, వినోదము కలిగించే మంచికధలను చెప్తాను శ్రధగా వినండి. ముందుగా మీకు "మిత్రలాభం" అనే కథ చెప్తాను. ఈ కథ వలన మంచివారితో స్నేహం ఎంతమేలు చేస్తుందో తెలియచేసి మన బుద్ధి వికసింపచేస్తుంది. మంచివారి మైత్రి వల్ల మనకు గౌరవం చేకూరి సర్వ శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఒక విషయం గుర్తు పెట్టుకోండి. సామాన్యుడు కానీ, రాజ్యాధికారి కానీ, తన జీవితకాలంలో మంచి మిత్రులను సంపాదించుకోవాలి. ఆపదలలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. పూర్వం ఒక అడవిలో కాకి, ఎలుక, తోడేలు, లేడి ఎంతో స్నేహంగా ఉండి, ఒకరికొకరు సహకరిస్తూ, ఎంతో లాభం పొందాయి. నేను మీకిప్పుడు ఆ నలుగురు ప్రాణమిత్రుల కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి" అని కథ ప్రారంభించాడు విష్ణుశర్మ.

బోయవాడు - పావురాలు.

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి. వాటియందు ఒక కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకము. ఒకనాడు తెల్లవారుజామున ఒక వేటకాడు అడవిలో నూకలు చల్లి వానిపై వలపన్ని కొంతదూరంలో దాగి ఉన్నాడు. ఇదంతా కాకి చూసింది. తెల్లవారుచుండగా కొన్ని పావురములు ఆకాశమార్గాన ఎగురుతూ భూమిపై నూకలు చూసాయి. వెంటనే క్రిందకు దిగి తిందామని ఆశపడగా, లఘుపతనకము వాటిని వారించి, 'నూకలకు ఆశపడి అక్కడికి పోవద్దు, ఇదంతా, వేటగాడి వల. నా మాట వినకుండా, మీరు అక్కడకు వెళ్ళారో, మీకింక భూమిపై నూకలు చెల్లినట్టే!' అంది. ఈ లోపల పావురాల నాయకుడయిన చిత్రగ్రీవుడు, కాకి మాటలను లెక్కపెట్టక, నూకలపై ఆశతో, తన పరివారంతో సహా అక్కడ వాలి, వలపై చిక్కుకున్నాడు. క్షణంలో కలకలం బయలుదేరింది. పక్షులన్నీ విలవిలా గింజుకోసాగాయి.

వలలో చిక్కుకుని, దిగులుపడిన కపోతాలతో, చిత్రగ్రీవుడు, 'కష్టాలు వచ్చినప్పుడే గుండె ధైర్యంతో ఎదురుకోవాలి. అంతే కాని, భయపడకూడదు. ఇప్పుడు మనమంతా కలిసికట్టుగా లేచి, ఈ వలను మొత్తం ఎత్తుకొని పోదాము,' అన్నాడు.

రాజాజ్ఞ మేరకు పక్షులన్నీ ఉవ్వెత్తున లేచి, ఒక్కసారిగా పైకి ఎగిరాయి. బోయవాడు పరిగెత్తుకు వచ్చేలోపే, ఆకాశానికి ఎగిరిపోయాయి. బోయవాడు వల వలా ఏడ్చాడు. కుయ్యో, మొర్రో అని మొత్తుకున్నాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ, వెళ్ళిపోయాడు.

ఆ పావురాలన్నీ యెగిరి ఎక్కడికి పోతాయో, ఎలా విడిపించుకుంటాయో చూడాలని, లఘుపతనకం (కాకి) ఆ గుంపు వెంటే ఎగురుకుంటూ వెళ్ళింది.

చిత్రగ్రీవుడు సాటి పావురాలతో, 'వేటగాడు తిరిగి పోయాడు, ఇంక మనకు మరేమీ భయం లేదు. ఉత్తరం దిక్కుగా బయలుదేరండి. అక్కడ హిరణ్యకుడని, నాకొక ఎలుక మిత్రుడు ఉన్నాడు. ఆ ఎలుకరాజు వద్దకు వెళితే, మన బంధనాలన్నీ కొరికి అవతల పారేస్తాడు,' అంటూ వాటికి ధైర్యం చెప్పాడు.

కపోత బృందం హిరణ్యకుడి బిలం వద్దకు చేరింది. అప్పుడు చిత్రగ్రీవుడు, 'మిత్రమా! చెడిపోయి వచ్చాను, నీవే ఆదుకోవాలి, ' అంటూ ఎలుగెత్తి పిలిచింది. మిత్రుని గొంతులోని ఆర్తిని విన్న ఎలుక వెంటనే వచ్చి, స్నేహితుడి పరిస్థితిని చూసి, 'అయ్యో, ఇది ఎలా జరిగింది?' అని అడిగింది.

'మిత్రమా! గింజల కోసం ఆశించి, నా పరివారంతో సహా ఇలా ఇరుక్కున్నాను. ముందుగా, నా వారయిన వీరందరి బంధనాలు తొలగించి, చివర్లో నా కాళ్ళకు ఉన్న తాళ్ళను కోరికివేద్దువుగాని,' అంది.

'ముందు రాజు, తరువాత సహచరులు కదా, మిత్రమా!', ఆశ్చర్యంతో అడిగింది మూషికం.

'కాదు మిత్రమా! తనను నమ్ముకున్న వాళ్ళ క్షేమం చూసి, తరువాత తన సంగతి చూడడం, రాజ ధర్మం. సహ్రుదయులేప్పుడూ ధర్మం తప్పరాదు. ఆలస్యం చెయ్యక, నా వారి బంధనాలు తొలగించు, మళ్ళీ ఆ బోయ మమ్మల్ని వెతుక్కుంటూ ఇటుగా వస్తాడేమో,' అన్నాడు చిత్రగ్రీవుడు.

చిత్రగ్రీవుడి మాటలు విన్న హిరణ్యకుడు, 'రాజ ధర్మాన్ని చక్కగా వినిపించావు మిత్రమా,' అంటూ, తన బలమంతా చూపి, చిటుకు పటుకుమని, ఆ పక్షులు చిక్కుకున్న తాళ్ళను ఒక్కొక్కటే కొరికి వేసింది. పావురాలన్నీ ఎగిరిపోయాకా, చివరగా చిత్రగీవుడి బంధనాలు తొలగించింది. ఇలా ఎలుక తన స్నేహితుడిని, అతని పరివారాన్ని చిక్కు నుంచీ విడిపించి, ఎంతో తృప్తిగా కలుగులోకి వెళ్ళిపోయింది.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top